Tokyo Olympics: 41 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెన్స్‌ హాకీలో భారత్‌కు కాంస్య పతకం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్‌ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ విరామం అనంతరం పతకాన్ని సాధించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. మ్యాచ్‌లో రెండు, మూడు క్వార్టర్స్‌లో భారత స్ట్రయికర్లు సత్తా చాటగా.. ఆఖరి క్వార్టర్‌లో జర్మనీ క్రీడాకారులు దూకుడు ప్రదర్శించినా.. డిఫెండర్లు, గోల్‌ కీపర్‌ సమర్థవంతంగా అడ్డుకున్నారు. పలు పెనాల్టీ కార్నర్లను గోల్‌ కాకుండా అడ్డుకొని ఒలింపిక్‌ పతకాన్ని ఒడిసిపట్టారు.

వెనుకబడినా.. పుంజుకొని..

మ్యాచ్‌లో మొదటి క్వార్టర్‌లో 0-1 గోల్స్‌తో భారత జట్టు వెనుకపడింది. రెండో క్వార్టర్‌లో సిమ్రన్‌ జీత్‌ ఒక గోల్‌ సాధించి.. స్కోరును 1-1 సమమం చేశాడు. ఆ తర్వాత జర్మనీ ఆటగాళ్లు రెండు గోల్స్‌ చేసి ఆధిక్యాన్ని 3-1 పెంచుకున్నారు. హర్ధిక్‌ సింగ్‌, హర్మన్‌ ప్రీత్‌ చెరో గోల్‌ సాధించగా.. 3-3తో సమం చేశారు. మూడోక్వార్టర్‌లో జర్మనీపై భారత్‌ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఇందులో భారత్‌ రెండు గోల్స్‌ సాధించింది. రూపిందర్‌ పాల్‌ నాలుగో గోల్‌ సాధించగా.. సిమ్రన్‌ జిత్‌ ఐదో గోల్‌ వేసి.. 5-3కు పెంచాడు.

మూడో క్వార్టర్‌ ముగిసే వరకు భారత్‌ 5-3తో ఆధిక్యంలో ఉంది. అయితే నాలుగో క్వార్టర్‌లో జర్మనీ గోల్‌ సాధించి ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. స్కోర్‌ను సమం చేసేందుకు జర్మనీ ఎంత ప్రయత్నించినా భారత ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు. రెండు, మూడు క్వార్టర్స్‌లో భారత స్ట్రయికర్లు సత్తా చాటగా.. ఆఖరి క్వార్టర్‌లో జర్మనీ క్రీడాకారులు దూకుడు ప్రదర్శించినా.. డిఫెండర్లు, గోల్‌ కీపర్‌ గోల్స్‌ కాకుండా అడ్డుకున్నారు. పలు పెనాల్టీ కార్నర్లను గోల్‌ కాకుండా చూశారు. భారత్‌ 17, 21, 29, 31, 34 నిమిషాల వ్యవధిలో గోల్స్‌ వేయగా.. జర్మనీ 2, 24, 45, 48 నిమిషాల్లో గోల్స్‌ సాధించింది. రెండు గోల్స్‌తో భారత విజయంలో సిమ్రన్‌ జీత్‌ కీలకపాత్ర పోషించాడు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో 12వ పతకం

ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 12 హాకీ పతకాలు గెలుపొందగా.. జపాన్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. టోక్యో 1964 గేమ్స్‌లో సైతం ఫైనల్‌లో పాక్‌నుఓడించి స్వర్ణం సాధించింది. ఇప్పటి వరకు ఈ విశ్వక్రీడలో ఇప్పటి వరకు భారత్‌కు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజత పతకం, మూడు కాంస్య పతకాలు వచ్చాయి.