సినీ న‌టి హేమ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్ స్పంద‌న‌!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో వేడి పుట్టిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటోన్న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్య‌క్షుడు నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డ‌బ్బంతా ఏమైంద‌ని హేమ ఇటీవ‌ల నిల‌దీసిన విష‌యం తెలిసిందే. ఈ విషయంపై 200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు.

హేమ చేసిన వ్యాఖ్య‌లపై న‌రేశ్ తో పాటు జీవితా రాజ‌శేఖ‌ర్ స్పందించారు. హేమ చేసిన ఆరోప‌ణ‌ల‌ను న‌రేశ్ ఖండిస్తూ ఈ రోజు ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మా అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కమిటీ తీసుకునే నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాల‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని కూడా హేమ ఆరోపించారు. లేదంటే ఎన్నికలు లేకుండా నరేశ్‌నే మ‌ళ్లీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.  దీనిపై కూడా న‌రేశ్ స్పందించారు. కొవిడ్ ప‌రిస్థితుల‌ దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని, పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

హేమ చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ చెప్పారు. మా స‌భ్యుల‌ను తిక‌మ‌క పెట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని ఆమె చెప్పారు. నిధులు ఉండేవి స‌భ్యుల కోస‌మేన‌ని, అవేమీ సొంత ప్ర‌యోజ‌నాల‌కు వాడుకునేందుకు కాద‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ చెప్పుకొచ్చారు. స‌భ్యులు వారికి ఇష్టం వ‌చ్చిన వారికి ఓట్లు వేయాల్సి ఉంటుంద‌ని, వారికి ఆ స్వేచ్ఛ ఉంటుంద‌ని చెప్పారు.