ఈటలను ఓడించాలని కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో  జన ఆశీర్వాద యాత్ర కొనసాగిస్తున్నారు. హన్మకొండ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందని అన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో ఈటల గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు.

తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్మును తండ్రీకొడుకులు కలిసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఓవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ దాటి బయటికి రావడంలేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో ఇక్కడ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి వివరించారు.

నేడు కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోనూ, అనంతరం వర్ధన్నపేట మీదుగా కొనసాగింది. తొర్రూరులో కిషన్ రెడ్డికి టీఆర్ఎస్, దళిత సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కిషన్ రెడ్డిని నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.