టు లెట్ బోర్డులపై జీహెచ్ఎంసీ జరిమానాల బాదుడు షురూ!

ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం టు లెట్ బోర్డులు పెట్టే వారిపై కొరడా ఝళిపిస్తామని ఇటీవల హెచ్చరించిన జీహెచ్ఎంసీ కార్యరంగంలోకి దిగింది. తాజాగా మూసాపేట డివిజన్ పరిధిలో ఓ దుకాణ యజమానికి రూ. 2 వేల జరిమానా విధించింది.

మోతీనగర్ పరిధిలోని పాండురంగ నగర్ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్యగౌడ్ దుకాణం కోసం ఓ గదిని అద్దెకు ఇచ్చేందుకు ‘టు లెట్’ బోర్డు తగిలించారు. దీన్ని నేరంగా పరిగణించిన జీహెచ్ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్ రూ. 2 వేల జరిమానా విధిస్తూ నిన్న నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా ఈ-చలానా ద్వారా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా, టు లెట్ బోర్డులపై జరిమానా విధించనున్నట్టు జీహెచ్ఎంసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా టులెట్ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో జనంలో గందరగోళం నెలకొంది.