‘పుష్ప’ విలన్‌ వచ్చేశాడు.. IPS భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహాద్

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ డ్రామా ”పుష్ప”. ఇందులో మలయాళ నేచురల్ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా నటిస్తున్న విషయం తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహాద్.. బన్నీ సినిమాలో విలన్ గా నటిస్తుండటంతో అందరి దృష్టి అతని పాత్రపై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫహాద్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

మోస్ట్ టాలెంటెడ్ ఫహద్ ఫాజిల్ మన పుష్పరాజ్ తో ఢీ కొట్టడానికి IPS భన్వర్ సింగ్ షెకావత్ గా వస్తున్నాడని ”పుష్ప” మేకర్స్ పేర్కొన్నారు. ఇందులో ఫహాద్ గుండు మీద గాటుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ మీద చేతులు ఉంచి ఇంటెన్స్ గా చూస్తున్నారు. సుకుమార్ విలన్ పాత్రను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘తగ్గేదే లే’ అంటూ బరిలో దిగే పుష్పరాజ్ కు ఎక్కడా తగ్గకుండా ఫహద్ పాత్ర ఉండబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది.

”పుష్ప” సినిమా ద్వారా టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న ఫహద్ ఫాజిల్ కు భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి. కాగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా ఊర మాస్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ – టీజర్ లలో అల్లు అర్జున్ లుక్ అభిమానులు విశేషంగా అలరించింది.