రాజకీయాల్లోనూ ‘పవర్ స్టార్’ గా పవన్ కల్యాణ్ !

సినిమాల్లో తిరుగులేని స్టార్ పవన్ కల్యాణ్. మరి రాజకీయాల్లోనూ పవర్ స్టార్ కాగలరా? అనే చర్చ నడుస్తూనే ఉంది. ఈ ప్రశ్నకు ఇక్కడ సమాధానం వెతుకుదాం. ఇందులో భాగంగా.. పవన్ కల్యాణ్ సినీ జీవితానికి, రాజకీయ జీవితానికి పోలిక పెట్టి చూడొచ్చు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ శరవేగంగా అగ్ర హీరో స్థాయికి చేరుకున్నారు పవర్ స్టార్. అయితే.. ఒకటీ రెండు పరాజయాలకే గ్రాఫ్ పడిపోయి.. ఫేట్ మారిపోయే సినీ పరిశ్రమలో వరుసగా పన్నెండేళ్ల పాటు ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయారు పవన్‌. 2001 సంవత్సరంలో వచ్చిన ఖుషీ తర్వాత.. మళ్లీ పవన్ హిట్ కొట్టింది 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ తోనే! అయినప్పటికీ.. ఆయన స్టార్ డమ్ అంతకంతకూ పైకి పెరిగిందే తప్ప.. తగ్గలేదు. ఇది భారతీయ చిత్రపరిశ్రమలోనే అరుదైన విషయం. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా.. పవన్ స్టామినా మరోసారి చర్చనీయాంశమైంది. ఇదేకోవలో.. పవన్ రాజకీయాల్లోనూ పవర్ స్టార్ కావడానికి పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటన్నది చూద్దాం.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన పవన్‌.. ఆ పార్టీని కాంగ్రెస్ లో కలపడాన్ని జీర్ణించుకోలేక.. సొంతంగా ‘జనసేన’ను స్థాపించాడు. ఆ సమయంలో.. మెగాస్టారే సాధించలేకపోయాడు.. పవన్ ఏం చేస్తాడు? అనే కామెంట్లు వినిపించాయి. అయినప్పటికీ.. పట్టుదలగా ముందుకే సాగాడు పవన్‌. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం పోటీచేస్తే.. ఒకే ఒక్క సీటు దక్కింది. పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో.. ఆ కామెంట్లకు మరింత బలం చేకూరింది. పవన్ పని అయిపోయింది.. ఇక వెళ్లి ముఖానికి రంగు వేసుకోవడమే అని ఎగతాళి చేశారు.
సహజంగా వేరే వ్యక్తులైతే అదే జరిగేదేమో.. కానీ, అక్కడున్నది పవన్ కల్యాణ్‌. పట్టుదలకు, మొండి తనానికి మరో పేరు. తాను ఎంచుకున్న మార్గం పూలబాట కాదని పవన్ కు ముందే తెలుసు. సుదీర్ఘ లక్ష్యం నిర్దేశించుకొని రాజకీయాల్లోకి వచ్చానని ముందుగానే ప్రకటించారు. ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నారు. రెండు చోట్లా ఓడిపోయినా.. ప్రజల మధ్యనే ఉన్నారు. ఇది ఖచ్చితంగా పవన్ కు కలిసి వచ్చే అంశం. ఇదే విషయాన్ని చాలా మంది రాజకీయ మేధావులు ఇప్పటికే చెప్పారు. కాబట్టి.. రాబోయే రోజుల్లో పవన్ ను జనం గుర్తిస్తారు.

పవన్‌ సినిమాల్లోకి తిరిగి వచ్చినా.. ఆయనపై పెద్దగా విమర్శలు రాకపోవడానికి కూడా కారణం ఇదే. ఒకరిద్దరు ప్రత్యర్థులు రొటీన్ విమర్శలు చేసినా.. పవన్ చెప్పిన సమాధానాన్ని అందరూ అంగీకరించారు. తాను బతకడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తనకు తెలిసిన విద్య సినిమా మాత్రమే అన్నారు పవన్. పార్టీని నడపడానికి ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే అన్నది అందరికీ తెలిసిందే. దానికోసమే తిరిగి సినిమాల్లో నటిస్తున్నట్టు కూడా ఓపెన్ గా చెప్పారు పవన్‌. అదే సమయంలో.. విమర్శలు చేస్తున్నవారిని కూడా కడిగేశారు. రాజకీయాలు చేస్తూ.. వ్యాపారాలు చేసుకుంటే తప్పులేదుగానీ.. సినిమా చేస్తే తప్పా? అన్న ప్రశ్ననూ జనం సమర్థించారు. ఆ విధంగా.. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు.

ఇక, రొటీన్ రాజకీయ నాయకుల మాదిరిగా.. ప్రతీ విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు పవన్‌. చేస్తున్న దానిలో మంచిని మంచి అని చెబుతూనే.. లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. ఇక, పొత్తు అంశం కూడా వచ్చే ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపనుంది. బీజేపీతోనే ఎన్నికలకు వెళ్తారా? నిర్ణయం ఏమైనా మారుతుందా? అనే అంశం ఫలితాలను మార్చొచ్చు.

పవన్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. కానీ.. గత ఎన్నికల్లో అభిమానులు మొత్తం ఆయనకు ఓట్లు వేయలేదు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ వేదికపై చెప్పారు. గుండెల్లో అభిమానం ఉంది.. కానీ, ఓటు వైసీపీకి వెళ్లిపోయిందని అన్నారు. అలాంటి వారంతా ఈ సారి పవన్ గురించి ఆలోచించొచ్చు. పవన్ సీరియస్ రాజకీయ నేతగా ముందుకు సాగుతున్నందున.. వచ్చే ఎన్నికల్లో వారు కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ.. పవన్ భవిష్యత్ సక్సెస్ ను చూపిస్తున్నాయని అంటున్నారు.