వినాయకచవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి: సోము వీర్రాజు

ఏపీలో కరోనా వ్యాప్తి దృష్ట్యా వినాయకచవితి వేడుకలను ప్రజలు ఇళ్లకే పరిమితం చేసుకోవాలని, బహిరంగ వేడుకలు వద్దని సీఎం జగన్ స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. వినాయకచవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం అన్నిరకాల వ్యాపార, విద్యాసంస్థలు కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నప్పుడు వినాయకచవితి వేడుకలకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఓవైపు కరోనా అదుపులో ఉందంటూనే వినాయకచవితి జరుపుకోకుండా ప్రజలపై ఆంక్షలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వినాయకచవితి అంశంపై ఏపీ సర్కారు పునరాలోచన చేయాలని సోము వీర్రాజు కోరారు.