Tokyo Paralympics: బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ప్రమోద్ భగత్

టోక్యోలో జరుగుతున్న పారాలింపింక్స్‌ పోటీల్లో ప్రమోద్ భగత్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఎస్ఎల్3 క్లాస్ లెవెల్స్‌లో జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్‌ పోటీల్లో గ్రేట్ బ్రిటన్‌కి చెందిన డానియెల్ బెతెల్‌ని ఓడించి ప్రమోద్ భగత్ ఈ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్‌తో పాటు రెండో రౌండ్‌లోనూ భారీ మెజార్టీతో దూకుడు కొనసాగించి ఘన విజయం సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ గేమ్‌లో 21-11 పాయింట్స్ తేడాతో గెలిచిన ప్రమోద్.. రెండో రౌండ్‌లోనూ అదే తరహాలో 21-16 పాయింట్స్ తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించాడు.

ఈ ఏడాదే తొలిసారిగా పారాలింపిక్స్ క్రీడల్లో బ్యాడ్మింటన్ ఆటను ప్రవేశపెట్టగా.. తొలి ప్రయత్నంలోనే గోల్డ్ మెడల్ సొంతం చేసుకుని ప్రమోద్ భగత్ చరిత్ర సృష్టించాడు. ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు పోలియో బారినపడిన ప్రమోద్ భగత్ ప్రస్తుతం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే బెస్ట్ పారా షట్లర్స్‌లో ఒకరిగా ముందు వరుసలో నిలిచారు.

ప్రమోద్ భగత్ ఖాతాలో ఇప్పటికే 45 అంతర్జాతీయ స్థాయి పతకాలు ఉన్నాయి. అందులో నాలుగు వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్స్ కాగా 2018 ఏషియన్ పారా గేమ్స్‌లో ఒకటి గోల్డ్ మెడల్, మరో బ్రాంజ్ మెడల్ గెల్చుకున్నాడు. ఇదే బ్యాడ్మింటన్ క్రీడల్లో మనోజ్ సర్కార్ అనే మరో పారా షట్లర్ దేశానికి మరో బ్రాంజ్ మెడల్ అందించాడు. జపాన్‌కి చెందిన డైసుకి ఫుజిహరతో హోరాహోరిగా తలపడిన మనోజ్ సర్కార్.. ఎట్టకేలకు అతడిపై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకున్నాడు.

టోక్యో పారాలింపిక్స్‌లో ఈ రెండు పతకాలు గెలుచుకున్న అనంతరం పతకాల పట్టికలో భారత్ 25వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి భారత్ ఖాతాలో మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.