నిలకడగా సాయి తేజ్‌ ఆరోగ్యం

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఐటీకారిడార్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడు, చిరంజీవి మేనల్లుడు సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు ప్రకటించారు. శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం లేదని శనివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్‌బులిటెన్‌లో తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు, మెదడుకు ఎలాంటి గాయాలు లేవన్నారు. కంటిపైన, ఛాతీపైన చర్మం బలంగా రోడ్డుకు గీసుకు పోవడంతో అక్కడ గాయాలయ్యాయని చెప్పారు. భుజం రోడ్డుకు గట్టిగా తాకడంతో కాలర్‌ బోన్‌ విరిగిందన్నారు. శస్త్రచికిత్స చేస్తామని, ఇందుకు మరో 24 గంటల సమయం పడుతుందన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యబృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని వివరించారు. చికిత్సకు పూర్తిగా స్పందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోకి వచ్చినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిందిలా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. .సాయి తేజ్‌ తన ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నుంచి మాదాపూర్‌ వేలాడే వంతెన మీదుగా రాయదుర్గం ఐకియా వైపునకు ట్రయంఫ్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై బయలుదేరారు. రాత్రి 8 గంటలకు నోవార్టిస్‌కు కొద్దిదూరంలో ఆయన బైక్‌పై నుంచి కింద పడ్డారు. అక్కడ రోడ్డుపై ఇసుక, మట్టి ఉండటంతో బైకు అదుపు తప్పి 50 మీటర్ల దూరం జారుతూ వెళ్లింది. ఘటనలో ఆయన కుడివైపు ఛాతీ, పొట్ట, కళ్ల చెంత, కాలి వేళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో మాదాపూర్‌ మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ‘అప్పటికే గ్లాస్గో కోమా స్కోర్‌ (జీసీఎస్‌) 7 వరకు ఉంది. మెదడు, ఇతర అవయవాల కదలికను బట్టి ప్రమాదానికి గురైన వ్యక్తులకు జీసీఎస్‌ను లెక్కకడతాం. ఆ స్కోరు సాధారణంగా 15 వరకు ఉండాలి. సాయిధరమ్‌కు జీసీఎస్‌ తక్కువగా ఉండటంతో కృత్రిమ శ్వాస అందించి ఫ్లూయిడ్స్‌ పెట్టాం’ అని మెడికవర్‌ వైద్యుడు డాక్టర్‌ సతీష్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన 30-40 నిమిషాల్లోనే ఆయనను ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అక్కడ రెండు గంటల పాటు చికిత్స అందించాక జూబ్లీహిల్స్‌ అపోలోకి తరలించారు.