నిమజ్జనంపై ఆంక్షలు ఎత్తివేయండి.. హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌..

గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసింది. వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పులో ఉన్న నాలుగు అంశాలను తొలగించాలని అందులో కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, హుస్సేన్‌సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని, కృత్రిమ రంగుల్లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. అదేవిధంగా రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ట్యాంక్‌బండ్‌కు అనుమతించకపోతే నిమజ్జనాలు పూర్తవడానికి ఆరు రోజులు పడుతుందన్నారు. రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమవుతుందని పేర్కొన్నారు. నగరంలో వేలసంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, అయితే విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవన్నారు. పెద్ద విగ్రహాలను కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమవుతుందని చెప్పారు. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ వద్ద క్రేన్లు, తదితర ఏర్పాట్లు చేశామని, దీనికి సంబంధించి నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పుడు వాటిని మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొన్నారు. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని తొలగిస్తామని, మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పారు.