విజయవాడ లోతట్టు ప్రాంతాలకు వరద ప్రమాదహెచ్చరిక

కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతున్నందున విజయవాడ నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ సూచించారు. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలతోపాటు నగరంలోని లోతట్టు ప్రాంతాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భూపేష్ గుప్తా నగర్, దివినగర్, భవానీపురం, విద్యాధపురం, తారకరామనగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పౌరుల క్షేమం కోసమే ఈ సూచన చేస్తున్నట్టు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు.

నగరవాసులకు అత్యవసర సహాయం కోసం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. అధికార యంత్రాంగం నుండి సహాయం కోసం 0866-2424172, 2422515కు ఫోన్ నెంబర్లపై సంప్రదించాల్సిందిగా ఆయన పౌరులకు విజ్ఞప్తిచేశారు.