ప్రజల మనసుల్ని దోచుకునేలా చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదన్న డైలాగు సినిమాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. రీల్ లైఫ్ లో చెప్పినంత డ్రమెటిక్ గా రియల్ లైఫ్ లో సాధ్యం కాదు. కానీ.. కొందరు మాత్రం అందుకు మినహాయింపుగా కనిపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జన్నార్ ను చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఐపీఏఎస్ లు ఉన్నారు. కానీ.. వారిలో అతి తక్కువ మందికి మాత్రమే ఉన్న ఇమేజ్ సజ్జనార్ సొంతం. ఒక సీనియర్ పోలీసు అధికారి.. సామాన్య ప్రజలకు సుపరితం కావటం ఒక ఎత్తు అయితే.. ఆయన్ను తమకు చాలా దగ్గరివాడిగా ఫీల్ కావటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే పనిగా చెప్పాలి.

తనకు అప్పజెప్పిన టాస్కును విజయవంతంగా నిర్వహించటంలో ఆయనకున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను అనూహ్యంగా తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా ఎంపిక చేసి సర్ ప్రైజ్ చేశారు. వాస్తవానికి ఆ పోస్టు విషయంలో సజ్జనార్ కాసింత నిరాశలో ఉన్నట్లు చెబుతారు. అయితే.. ప్రభుత్వం తన మీద పెట్టిన బాధ్యతను నూటికి నూరుపాళ్లు అమలు చేసే అలవాటు ఉన్న ఆయన.. అందుకు తగ్గట్లే.. ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. అప్పుడు ఆర్టీసీపై తన మార్కును ప్రదర్శిస్తున్నారు.

ఇప్పటివరకు సంస్థకు ఎండీలుగా వ్యవహరించిన వారికి భిన్నంగా ఆయన ప్రదర్శిస్తున్న పని తీరుకు ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఫిదా అవుతున్నారు. నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక సిటీ బస్టాప్ లో ఒక సామాన్య ప్రయాణికుడిలా సిటీ బస్సు ఎక్కిన ఆయన కొంత దూరం ప్రయాణించటమే కాదు.. ప్రయాణ అనుభవాన్ని.. బస్సులోని ప్రయాణికుల నుంచి సమస్యల గురించి అడిగి తెలుసుకోవటం చూస్తే.. పని చేసే అధికారికి ఎలాంటి పోస్టింగ్ ఇచ్చినా.. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడన్న దానికి నిదర్శనంగా నిలుస్తారు. ఆర్టీసీ ఎండీ పదవి అన్నంతనే.. ఎక్కడో బస్సు భవన్ లో ముడుచుకొని కూర్చోవటంగా భావిస్తారు. అలాంటి పోస్టు సజ్జనార్ లాంటి వారికి ఇస్తే దాన్ని ఎలా మారుస్తారన్న దానికి నిదర్శనంగా ఆయన తీరు ఉంటోంది.


తాజాగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వినాయకుడి నిమజ్జనాలు సందడిగా సాగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు పూజలు అందుకున్న గణనాధులను గంగమ్మ ఒడికి చేర్చే బిజీగా నగరం ఉంది. ఇలాంటి వేళ.. ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్.. ఆర్టీసీ బస్సులోకూర్చొని ఒడిలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని.. ఆర్టీసీ ఉద్యోగులు.. కుటుంబ సభ్యులతో కలిసి.. నిమజ్జనానికి బస్సులో బయలుదేరిన వైనం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కంటెంట్ ఉన్న ఆఫీసర్.. ప్రజలకు ఎప్పుడు ఎలాఅందుబాటులో ఉండాలన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపిస్తారనటానికి నిదర్శనంగా సజ్జనార్ తాజా బస్సు ప్రయాణంగా చెప్పక తప్పదు.