Flight Facility : హైదరాబాద్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు విమానం

హైదరాబాద్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల కోసం డైరెక్ట్‌ విమాన సౌకర్యం కల్పిస్తామని జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అహ్సాస్‌ చిస్తీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో శనివారం తెలంగాణ టూరిజం, కశ్మీర్‌ టూరిజం ప్రమోషన్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే వారికి షూటింగ్‌ కోసం ఉచిత పర్మిషన్‌ ఇస్తామని చెప్పారు.

అనంతరం తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ నుంచి వచ్చే పర్యాటకులకు వసతి, రవాణా సౌకర్యాలపై ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలను వివరించారు. తెలంగాణ నుంచి కశ్మీర్‌కు వచ్చే పర్యాటకులకు ప్రాధాన్యం ఇవ్వాలని, సౌకర్యాలు కల్పించాలని కోరారు.

రామప్ప టెంపుల్‌పై ప్రత్యేక దృష్టి సారించి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చేలా ప్రమోట్‌ చేయాలని సూచించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, సోమశిల, అనంతగిరి, బుద్ధవనం, నాగార్జున సాగర్‌, లక్నవరం, దుర్గం చెరువు తెలంగాణ టూరిజం గమ్యస్థానాల గురించి వివరించారు.