నేటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది.  బుధవారం బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. గురువారం సాయంత్రం నిర్వహించే ప్రధమ ఘట్టమైన ధ్వజారోహణ ఘట్టాన్ని సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల నడుమ మీనా లగ్నంలో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్తమరుత్తులను (దేవతాపురుషులు), రుషిగణాన్ని, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాళ్వార్ ధ్వజస్తంభాన్ని అధిరోహిస్తారని ప్రాశస్త్యం. విశ్వమంతా గరుడుడు వ్యాపించి ఉంటారు. ఆయన్ను శ్రీనివాసుడు వాహనంగా చేసుకోవడంతో సర్వాంతర్యామిగా స్వామివారు కీర్తించబడుతున్నారు.

కాగా, ధ్వజపటంపై గరుడునితోపాటు సూర్యచంద్రులకు కూడా స్థానం కల్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పెసరపప్పు అన్నం(ముద్గర) ప్రసాదంగా వినియోగిస్తారు. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంపదలు సమకూరుతాయని విశ్వాసం. అదే విధంగా, ధ్వజస్తంభానికి కట్టిన దర్భ అమృతత్వానికి ప్రతీక. పంచభూతాలు, సప్తమరుత్తులు కలిపి 12 మంది దీనికి అధిష్టాన దేవతలు. ఇది సకలదోషాలను హరిస్తుంది. దర్భను కోసేటప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేటపుడు ధన్వంతరి మంత్ర పారాయణం చేస్తారు. ధ్వజారోహణం అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు.

ధ్వజారోహణ ఘట్టానికి ముందుకు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు.

ప్రథమంగా పెద్దశేషవాహన సేవ..

గురువారం రాత్రి పెద్దశేష వాహనం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి స్వామి వారి ఉభయదేవురలతో కలసి పెద్దశేషవాహనంపై శ్రీ మన్నారయణ భగవానుడికి పాయకశయనమైన వాడు అదిశేషుడు. పాలసముద్రంలో నారాయణుడికి వెయ్యి పడగలతోటి నీడనిస్తూ సర్పజాతి అధిపతైన అదిశేషుడు పాపలను నిర్మూలించగల శక్తి గలవాడు. అర్చావాతరమూర్తైన శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రారంభ వాహనంగా అదిశేష వాహన సేవ జరుగుతుంది. శ్రీనివాసుడికి గృహాంగానూ, శయన మందిరం, అసనం, పాదుకలు, వస్త్రం, గొడుగుగా ఆయా అవసరాలను తగ్గట్టుగా స్వామి కైంకర్యాం చేసేవారు అదిశేషుడు.

స్వార్థం లేని దాసకైంకర్యానికి అదిశేషుడు ప్రతీకగా నిలుస్తాడు. విశిష్టాద్వైత సిద్ధాతం ప్రకారం భగవంతుడు శేషి ఇతరమైనవి, శేషబూతాలు. శేషవాహనంపై స్వామివారు ఊరేగడం ద్వారా శేషశేషి మధ్యవున్న పరమార్థాన్ని బోధిస్తున్నాడని తెలుస్తుంది. ఏడు పడగలు కలిగిన పెద్దశేష వాహనాన్ని దర్శించడం ద్వారా భక్తులు తాము చేసిన పాపలను నుండి విముక్తులై వేంకటేశ్వరుడి దాసులుగా మారుతారని భక్తుల నమ్మకం. మరోవైపు కరోనా కారణంగా ఈ ఏడాది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ… వాహనసేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహించనుంది.