స్టార్ హీరోలకు జగన్ షాక్.. పెద్ద చిత్రాల విడుదల పై టాలీవుడ్ లో గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలను ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజానికి కొద్ది రోజుల క్రితమే 100% సీటింగ్ సామర్థ్యం అనుమతిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సినీ పెద్దలు సంతోషించారు. అయితే, టికెట్ రేట్లు పెంపు విషయంలో మాత్రం అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

త్వరలోనే టికెట్ రేట్ల పెంపు కూడా ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో.. ఇప్పట్లో ఆ ఉద్దేశం లేదని జగన్ ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. పైగా ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మళ్లీ రేట్లు పెంచుకునేందుకు ఇన్నాళ్లు ప్రభుత్వం అనుమతిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.

అయితే 100% ఆక్యుపెన్సీతో రోజుకు నాలుగు షోలకు అనుమతి ఇచ్చినంత తేలికగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ సినీ పెద్దలు రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భేటీ అయి.. సమస్యలను చెప్పుకున్నారు. అయినా, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వారిని ఎక్కువ బాధిస్తుంది.

గతంలో ఏ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమస్య రాలేదు. పైగా స్వయంగా ప్రభుత్వమే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. కానీ మరో ఏడాదికి.. అంటే 2022 వేసవి కాలానికి గానీ ఈ పోర్టల్ అందుబాటులోకి రాదు. అప్పుడు టికెట్ రేట్లు కొంతవరకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఈ లోపు రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి ?

పెద్ద సినిమాల నిర్మాతలు దాదాపుగా రిలీజ్ డేట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడన్న టికెట్ రేట్లుతో ఆయా సినిమాలకు భారీ నష్టాలు తప్పవు. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం టికెట్ రేట్ల నిర్ణయం.. టాలీవుడ్ నిర్మాతలలో రోజురోజుకు టెన్షన్ పెంచుతుంది. ఇది ఇలాగే కొనసాగితే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కు కూడా ఎసరు వచ్చే అవకాశం ఉంది.

అయినా స్టార్ హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నామని.. లేక తమ సినిమా పాన్ ఇండియా సినిమా అని నిర్మాతలు, బయ్యర్లు ఇష్టమొచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచుతూ ప్రేక్షకులను దోచుకోవడం కచ్చితంగా తప్పే. ఇలాంటి అదనపు దోపిడీలను నిరోధించడానికి ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, తప్పదు. కానీ సినిమా ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులను కూడా జగన్ ప్రభుత్వం ఆలోచించాలి.

టికెట్ రెట్టింపు రేట్ల విషయంలో ఆంక్షలు పెట్టొచ్చు, ప్రాంతాలను బట్టి, ఆయా సినిమాల అంచనాలను బట్టి ఆ ఆంక్షలకు కొన్ని సడలింపులు ఇవ్వాలి. అంతేగాని తమదే శాసనం, తమ నిర్ణయమే పరిష్కారం అన్నట్టు వ్యవహరిస్తే.. సినిమా వ్యవస్థ కుంటుపడుతుంది. అసలు ఎవరో సినిమాని ఇంకెవరో అమ్ముకోవడం ఏమిటి ? దాన్ని ప్రభుత్వమే అమలు పరచడం ఏమిటి ? జగన్ ఇలాంటి నిర్ణయాలు పై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.