ప్లీనరీకి గ్రేటర్ టిఆర్‌ఎస్ నేతలు

నగరంలో నేడు టిఆర్‌ఎస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించే ప్లీనరీ సమావేశానికి నగరం నుంచి నేతలు పెద్ద ఎత్తున బయలు దేరుతున్నారు. ఇప్పటికే నగరమంతా గులాబీమయం చేశారు. ప్రధాన కూడళ్లు, మెట్రో పిల్లర్లు పూర్తిగా టిఆర్‌ఎస్ నేతల పోటో ప్లెక్సీలతో దర్శనమిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి డివిజన్ల వారీగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సమావేశాలు నిర్వహించి, సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను వివరిస్తూ సంస్దాగతం పార్టీ బలోపేతం కోసం అందరు ఐక్యంగా కలిసి పనిచేయాలని సూచనలు చేశారు. సోమవారం హెచ్‌ఐసీసీ వేదిక నిర్వహించే ప్లీనరీకి పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, డివిజన్, బస్తీలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ప్రతి నియోజకవర్గం నుంచి 30మంది ప్లీనరీకి హాజరైతున్నారు. రెండు రోజుల కితమే సభకు వెళ్లేవారందరికి ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు.

సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంబీపూర్‌రాజు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చేశారు. మహానగరం నుంచి 950 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అదే విధంగా హైటెక్స్‌లో జరిగే ప్లీనరీ సంబంధించిన కూడ గ్రేటర్ నాయకులు దగ్గరుండి తగిన ఏర్పాట్లను ఐదారు రోజుల్లో పూర్తి చేశారు. నేడు జరిగే ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించనున్నట్లు, ఇప్పటివరకు బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశ పథకాలైన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, ఆసరా ఫించన్లు, రేషన్‌కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్లైఓవర్ నిర్మాణాలు, పాదచారుల వంతెనలు, నెలకు 20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా, గురుకుల పాఠశాలలు వంటివి నాయకులకు వివరించనున్నారు. ప్లీనరీ వచ్చే అతిథుల కోసం 29 రకాల వంటకాలను సిద్దం చేశారు. ఒకేసారి 8వేల మంది భోజనం చేసేలా , 15వేల మందికి సరిపడ రుచికరమైన వంటలు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ప్రత్యేకంగా వంటకాలైన థమ్ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్, బొటిప్రై, ఎగ్ మసాలా, రూమాల్ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ, పులుసు, బెండకాయ కాజుప్రై, దాల్ రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు, వంకాయ చట్నీ, వెల్లుల్ని జీడిగుల్ల, అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్, వడియాలు, జిలేబీ, డబల్ కామీఠా, ఐస్‌క్రీం, గ్రీన్‌సలాడ్, బటర్‌రైస్, డ్రై ప్రూట్స్ ,బుద్ది, లడ్డూ, చాయ సిద్దం చేస్తున్నారు.ప్లీనరీకి హాజరయ్యే నాయకులంతా ఆఖరి వక్త ప్రసంగించే వరకు ఉండాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నారు.