జనసేనాని వైజాగ్ టూర్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు విశాఖ పట్నంలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సభకు పవన్ హాజరుకానున్నారు.

విశాఖ ఉక్కు కార్మికులకు పార్టీ తరపున అండదండలు అందిచాలని జనసేన అధినేత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాజీ జనసేన నేత సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలియజేసినందుకు జేడీ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకునేలా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. అంతేకాదు సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరు హ్యాష్ ట్యాగ్ తో #savevizagsteelplant సోషల్ మీడియా వేదికగా తన సంఘీభావం చెప్పారు.

ఇప్పటికే అమరావతిలో ఉద్యమం చేస్తున్న రైతులకు జేడీ లక్ష్మీనారాయణ తన మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఉద్యమం సాగుతున్న తీరుపై ఆరా తీసిన లక్ష్మీనారాయణ వారికి తన సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే.