కొత్త టెక్నాలజీతో పునీత్‌ వాయిస్‌ డబ్బింగ్‌

కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంతో ఆయన చివరిగా సంతకం చేసిన రెండు సినిమాలు ప్రశ్నార్థకంగా మారాయి. మరణించే సమయానికి ఆయన నటిస్తున్న ‘జేమ్స్‌’ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా..మరో చిత్రం ‘ద్విత్వ’ డిసెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. దాదాపు 60 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ‘జేమ్స్‌’ మూవీలో పునీత్‌ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నారు. జేమ్స్‌ మూవీ ఒక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా పునీత్‌ మృతి చెందడంతో సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ సినిమాలో పునీత్‌ యాక్షన్‌ పార్ట్‌ పూర్తయింది. డబ్బింగ్‌ విషయమై అధునాతన టెక్నాలజీ ఉపయోగించాలని చిత్రబృందం యోచిస్తోంది. ఇందుకోసం ముంబైకి చెందిన ఓ ఐటీ కంపెనీని రంగలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో ‘జేమ్స్‌’ షూటింగ్‌ సమయంలో పునీత్‌ చెప్పిన డైలాగ్స్‌ క్వాలిటీ పెంచి విజువల్స్‌కు సింక్‌ చేసే ప్రయత్నం చేయబోతున్నారని సమాచారం. 2022 మార్చి 17న పునీత్‌ పుట్టినరోజుకు ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.