కరోనా కాలంలో తొలి పరీక్ష: టీఎస్ ఈసెట్

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడిన పరీక్షలను ఒక్కొక్కటిగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

కాగా, తెలంగాణలో ఉమ్మడి ప్రవేశపరీక్షలు ఈ రోజు నుండీ (ఆగస్టు 31) నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర స్థాయితోపాటు జాతీయస్థాయిలో కూడా కామన్ ఎంట్రాన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ రోజు  జరగనున్న ఈసెట్ పరీక్షకు మొత్తం 28,015 మంది దరఖాస్తు చేసుకున్నారు.

కరోనా సమయంలో జరుగుతున్న మొదటి ఎంట్రన్స్ పరీక్ష కావడంతో ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పరీక్షను రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం పరీక్షకు 7.30 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. అంతేగాక, విద్యార్థులు మాస్కులు, వాటర్ బాటిల్స్, శానిటైజర్స్ తెచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 56 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో 52 కేంద్రాలు తెలంగాణలో ఉండగా, నాలుగు కేంద్రాలు ఏపీలో ఉన్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ టీఎస్ ఈసెట్ పరీక్ష నిర్వహిస్తోంది.