గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. సెప్టెంబర్‌ ఒకటిన జరిగే నిమజ్జనోత్సవం కోసం సర్వం సిద్ధం చేశామన్నారు. సోమవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులతో ట్యాంక్‌బండ్‌ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాలతో కలిసి ట్యాంక్‌బండ్‌పై గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

వారం రోజుల నుంచి 30 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారని తెలిపారు. మంగళవారం నిమజ్జనానికి మూడు వేల నుంచి నాలుగు వేల విగ్రహాలు తరలివస్తాయన్నారు. ట్యాంక్‌బండ్‌పై 21 క్రేన్లు ఏర్పాటు చేశామని, 15 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని సీపీ పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 15 నుంచి 18 కిలోమీటర్లు నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుని నిబంధనలు పాటించాలని కోరారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి లేదన్నారు.

కార్యక్రమంలో అదనపు సీపీలు షికాగోయెల్‌, అనిల్‌కుమార్‌, డీఎస్‌ చౌహాన్‌, జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌, అదనపు డీసీపీ ట్రాఫిక్‌ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఉన్న సెంట్రల్‌, ఈస్ట్‌, వెస్ట్‌, సౌత్‌, నార్త్‌ జోన్లకు సంబంధించి వాహనాలకు పాస్‌లు కేటాయించారు. ఖైరతాబాద్‌ గణనాథుడి తరలింపునకు సంబంధించి అధికారులు రూట్‌మ్యాప్‌ విడుదల చేశారు.