వీరఘట్టం మండలం జనసేన ఆధ్వర్యంలో సావిత్రిబాయికి ఘన నివాళులు

జనసేన పార్టీ వీరఘట్టం మండలం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు… పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. మంచి వక్త… కులం, పితృస్వామ్యంపై కలం యుద్ధం నడిపిన కవయిత్రి.. యుక్తవయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని శూద్రులకు, దళితులకు పాఠశాలలు నడిపిన గొప్ప మానవతావాది స్త్రీ పురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి… అందరూ సమానంగా బ్రతకాలి… అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆమె తన భర్తకు తోడునీడగా నడవడం మాత్రమే కాక, స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది. అని జనసేన పార్టీ మండల నాయకుడు మత్స పుండరీకం అన్నారు. ఈ కార్యక్రమంలో వాన కైలాష్, కంటు గణేష్, మామిడి రాంబాబు, బి. శంకర్ రావు, వావిలపల్లి విస్సు విద్యార్థులు, జనసైనికులు పాల్గొన్నారు.