సర్కారు వారి సంక్రాంతి దోపిడీ!

*పండగ వేళ అధికారిక దందా
*ఏపీఎస్ ఆర్టీసీ అడ్డగోలు వసూళ్లు
*స్పెషల్ బస్సులంటూ అదనపు ఛార్జీలు
*చోద్యం చూస్తున్న వైసీపీ ప్రభుత్వం

ఆర్టీసీ అంటే రాదు, తెలియదు, చెప్పలేం అనుకునేవాళ్లం. అది ఆ బస్సుల రాకపోకల గురించి! మరి ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఇకనైనా బాగుపడుతుందా అన్నప్పుడు కూడా ఆ మూడు మాటలే వర్తిస్తాయి! ‘బస్సు చక్రం ప్రగతికి చిహ్నం’ అని తెగ ఊదరగొడుతోంది ప్రభుత్వం. ఆ ప్రగతి ఇంకెప్పుడు…. అసలది వస్తుందా అంటే రాదని, తెలియదని, చెప్పలేమని బదులివ్వాల్సిందే!! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని నిర్వహణలోని రోడ్డు రవాణా సంస్థ వ్యవహారం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అది చెప్తున్న ప్రగతి ఎందులో అంటారా? బస్సు ఛార్జీల బాదుడులో! పండుగల వేళ ప్రతి ఏటా ఎదురవుతున్న దుర్మార్గం ఇది. మనందరి పెద్ద పండుగ, కొత్త సంవత్సరం మొదట్లో వచ్చేదే సంక్రాంతి. పిల్లాపాపలతో సొంత ఊళ్లకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ తహతహలాడుతారు. అసలే రెండేళ్లుగా కరోనా మహమ్మారి విరుచుకుపడి, ఎవరినీ ఎక్కడకు కదలకుండా చేసింది. కనీసం ఈసారైనా, ఈ 2022లోనైనా స్వస్థలానికి వెళ్లి కుటుంబాలు, బంధుమిత్రులు, ఊళ్ళో వాళ్ళని చూసి రావాలని అందరూ పెట్టే బేడా సర్దుకుని బస్ స్టాండ్ వైపు సాగిపోతున్నారు. పండుగ రోజులన్నీ స్వగ్రామంలోనే గడిపి, సరికొత్త అనుభవాలతో ఆశలతో తిరిగి ఇళ్లకు మళ్లాలని మనసారా కోరుకుంటున్నారు. అలా అనుకునే ప్రతి ఒక్క సాధారణ ప్రయాణికుని నడ్డినీ విరిచి పారేస్తోంది ఆర్టీసీ. ప్రత్యేక బస్సులు…. అదనపు చార్జీలంటూ విపరీతంగా వడ్డించి, ఖర్చుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది.

ఏమని అర్థం చేసుకోవాలి

ఉన్నవాళ్లయితే విమానాలు, ఏసీ రైలు, సొంత వాహనాల్లో పండుగ ప్రయాణాలు చేస్తారు. సామాన్యుల వాహనం బస్సే. దానితోనే వారి అనుభూతులు కలగలిసి ఉంటాయి. ఇప్పుడు 6970 స్పెషల్ బస్సులు వేశామని, పండుగ రద్దీని బట్టి ఈ నెల 18 వరకు అవన్నీ తిరుగుతాయని ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఢంకా బజాయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 35 శాతం ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని, వాటిల్లోనే 50 శాతం వరకు అదనపు చార్జీలు ఉంటాయని చావు కబురు చల్లగా చెప్పింది. ప్రస్తుతం ఉన్న టిక్కెట్ ధరకు ఈ ‘పెంపుదల’ తోడవుతుందని చెప్పిన సంస్థ ఎండీ ‘పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్టీసీని ఆదరించండి’ అని చిలక పలుకులు వల్లించారు. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద రవాణా సంస్థ అది. ప్రయాణికులకు సంతృప్తి కలిగేలా నాణ్యమైన సేవలు అందిస్తామని సంస్థాగతంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇప్పటికీ ఇస్తోంది. నిజాయితీగా విధులు నిర్వహిస్తామని, ప్రజల అవసరాలకు ధీటుగా ఆదుకుంటామని వెబ్సైట్ల ద్వారా వాగ్దానాలు, ప్రమాణాలు గుప్పిస్తోంది. ఇంతగా కబుర్లు ఒలకబోసే సంస్థ స్థితి ఇప్పుడు ఏమైందో, దాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటో పాలకులకే తెలియాలి. ఆదరించడం అంటే ఏమిటి? ఏటేటా పండుగల సీజన్లో అడ్డగోలుగా పెరుగుతూపోయే ఛార్జీల్ని నోరుమూసుకొని చెల్లించండమా? సేవల్లో నాణ్యత లేనేలేదు. ప్రజల సంతృప్తి ఆదరణను ఎలాగూ పొందలేదు. జనం ప్రయాణ అవసరాల్లో ఆదుకోవడమంటే ఇదేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి తీరాల్సిందే.

ప్రైవేటుకు ధీటుగా….

విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు వేశారు. జిల్లా కేంద్రాల నుంచి వాటిని’ ప్రత్యేక ఏర్పాట్ల’ తో నడుపుతున్నారు. పండుగకు ముందు (14వ తేదీ వరకు) రోజుకు 470 వంతున 3755 బస్సుల్ని కేటాయించారు. సంక్రాంతి తర్వాత (15 నుంచి 18 దాకా) రోజుకు 400 చొప్పున మిగిలిన 3215 బస్సులు నడుస్తాయి. మొత్తం 6970 ‘స్పెషల్’ లోనూ వడ్డనే వడ్డన! ఒకవైపు ప్రైవేటు బస్సుల ధనదాహం, దానికి తోడు పడినట్లు సాక్షాత్తూ ప్రభుత్వ సంస్థ ఆర్టీసీ చేసే నిలువు దోపిడీ!! చార్జీల మోత, ప్రయాణభారం సగటు ప్రయాణికుల పాలిట పెనుశాపాల్లా దాపురించాయి. పాఠశాలలు, కళాశాలలకు పండుగ సెలవులు. విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఉద్యోగులు, కార్మికులు ఇతర శ్రమజీవులు, మహిళలు, పిల్లలు పెద్దలు అంతా సంక్రాంతి రోజులు గడిపి రావాలని కదులుతుండగానే వారి జేబుల్ని ఖాళీ చేసే నిర్వాకానికి తెగబడింది ఆర్టీసీ. ప్రైవేటు వాళ్ళు విజయవాడ – హైదరాబాద్ – విశాఖ మధ్య మూడు వేల నుంచి 5 వేల రూపాయల దాకా దండుకుంటున్నారు. వాళ్లతో పోటీ పడుతున్నట్లుగా ఆర్టీసీ బస్సుల్లోనూ ఛార్జీలను కొన్ని రెట్లు పెంచడం ఏ ప్రగతికి ప్రతీక? తెలంగాణలో ఎటువంటి అదనపు భారాలు లేవు కదా అంటే, ‘ నువ్వా – నేనా’ అని కాకుండా ‘నువ్వు – నేను’ అనే స్థితికి రావాలి అంటున్నారు ఏపీ ఉన్నత అధికారులు. దీని భావమేమి జగన్మోహనా? ప్రభుత్వ రంగ సంస్థలు ‘ఉమ్మడి’ గా పని చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు అనడంలో ఆంతర్యమేమిటి ? రూపాయి ఎక్కువైనా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం చెబుతోంది. ఎన్నెన్ని రూపాయలు ఎక్కువగా పెంచారో, ఏ మాత్రం ప్రయాణ సేవలు అందిస్తున్నారో ఆ ‘ప్రజా ప్రభుత్వానికే’ తెలియాలి.

ఇకనైనా ‘వడ్డింపు’ ఆపండి

రవాణా సంస్థ ఆదాయం పెరగాలంటే, ఆ ఆలోచనైనా ప్రభుత్వానికి ఉంటే – ముందుగా ప్రైవేటు దోపిడీదారుల పనిపట్టాలి. సరుకు రవాణాను విస్తృతం చేయడంతో పాటు, ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. అంతేతప్ప పండుగ రోజులన్నీ బస్సు టికెట్ల రేట్లను ఇష్టానుసారం పెంచడం కాదు. ఇదంతా ప్రతి సంవత్సరం కొనసాగుతున్న అధికారిక తంతు. ఇంకా ఘాటుగా చెప్పాలంటే వికృత పోకడ. అడ్డుకట్ట పడకపోతే – ఆ వ్యవస్థకైనా, రవాణా సంస్థకైనా ముప్పు తప్పదు తస్మాత్ జాగ్రత్త.