నేను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదు: సుమలతా అంబరీశ్

డ్రగ్స్ వ్యవహారం కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న తరుణంలో దీనిపై స్పందించిన లోక్ సభ సభ్యురాలు, నటి సుమలతా అంబరీశ్, కేవలం సినీ పరిశ్రమను మాత్రమే ప్రత్యేకించి వేలెత్తి చూపవద్దని హెచ్చరించారు. ప్రతి రంగంలోనూ మంచి, చెడులు ఉన్నాయని, డ్రగ్స్ కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే వాడతారా? అని ప్రశ్నించారు.

నేను ఎప్పుడూ మత్తుమందులను వాడలేదని స్పష్టం చేసిన ఆమె, యువత విషయంలో మాత్రం వస్తున్న ఆరోపణల్లో కొంత నిజాలున్నా.. డ్రగ్స్ లేవని తాను చెప్పడం లేదని, లోతైన దర్యాఫ్తు చేస్తే, నిజానిజాలన్నీ వెలుగులోకి వస్తాయని, అప్పటివరకూ వేచి చూడాలన్నదే తన అభిప్రాయమని అన్నారు.

ఎవరి వద్దనైనా డ్రగ్స్ కు సంబంధించిన ఆధారాలు ఉంటే, వాటిని దర్యాఫ్తు సంస్థలకు అందించాలని చెప్పిన సుమలత, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని, కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన, వారిని దోషులుగా చూడవవద్దని సూచించారు. వచ్చిన ఆరోపణలు రుజువయ్యేంత వరకూ ఎవరికి తోచిన విధంగా వారు తీర్పులను ప్రకటించేయడం సరికాదని హితవు పలికారు.