నేటి తో ముగియనున్నఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా 8వ రోజు బుధవారం ఉదయం సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. కాగా శాసనసభ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. దీనికి సంబంధించి నిన్న బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బిల్లులన్నీ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో సమావేశాలు బుధవారంతో ముగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈరోజు జీహెచ్ఎంసీ సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు.