స్కూల్స్ రిఓపెనింగ్‌కు ఏపీ విద్యా శాఖ మార్గదర్శకాలు

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడగా.. అన్‌లాక్ 4లో భాగంగా కేంద్రం మార్గద్రర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు స్కూళ్లను తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో స్కూళ్ల రి ఓపెనింగ్‌పై ఏపీ విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. స్కూళ్లలో టీచర్లు ఎలా వ్యవహరించాలి? విద్యార్థులు ఏం చేయాలి? ఎలా ఉండాలి? విద్యా బోధన ఎలా చేయాలో మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ వివరాలను క్రింది విధమగ్ ఉన్నాయి.

స్కూళ్ల ప్రారంభానికి మార్గదర్శకాలు:

కంటైన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మాత్రమే తెరవాలి. వాటిలో ఆన్‌లైన్‌ టీచింగ్, టెలీకౌన్సెలింగ్, విద్యావారధి వంటి కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరుకావచ్చు.

సెప్టెంబరు 21 నుంచి కంటైన్‌మెంట్‌ జోన్ల బయట తెరిచే స్కూళ్లు, కాలేజీల్లోకి 9-12 తరగతుల పిల్లలను మాత్రమే సందేహాల నివృత్తికి అనుమతించాలి. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

1-8 తరగతుల విద్యార్థులు ఇంటి వద్ద నుంచే పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయాలి. వారి తల్లిదండ్రులు, సంరక్షకులను పిలిచి మాట్లాడాలి.

అక్టోబరు 5 నుంచి జరిగే ఆన్‌లైన్, విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు అభ్యసనం కొనసాగించాలి.

1-8 తరగతుల పిల్లలకు సంబంధించిన వర్క్‌ షీట్లను అభ్యాస యాప్‌లో పొందుపరిచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని చదువుకునేలా మార్గనిర్దేశం చేయాలి.విద్యార్థులు, సిబ్బంది కరోనా బారినపడకుండా ఉండేందుకు అన్ని ప్రజారోగ్య చర్యలను పాఠశాలల హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాళ్లు చేపట్టాలి.

పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు కనీసం ఆరడుగుల దూరం పాటించేలా చూడాలి. అందరూ ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలి. శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.

దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు వినియోగించే టిష్యూ, కర్చీఫ్‌లను నిర్దేశిత ప్రాంతంలో పడేయాలి.

స్కూళ్లలో తరగతి గదులు, లేబొరేటరీలు, ఇతర వినియోగ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. స్కూల్ ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత శానిటైజ్ చేయాలి.

విద్యార్థులు నోట్‌బుక్స్, పెన్నులు, వాటర్‌బాటిళ్లుతో పాటు మరే ఇతర వస్తువలను ఇచ్చిపుచ్చుకోవడాన్ని అనుమతించకూడదు.

గురుకుల స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో టీచర్లు వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయించి సలహాలు సూచనలు ఇవ్వాలి.