‘మా మొర ఆలకించండి’.. మోదీకి రైతుల వినూత్న శుభాకాంక్షలు

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తోన్న ఉద్యమం గురువారానికి 275వ రోజుకు చేరుకోగా.. ‘మోదీ గారు మా మొర ఆలకించండి’ అంటూ ప్రధాని మాస్కులు ధరించిన రైతులు ఆయనకు వినూత్న శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లాయపాలెం పుష్కరఘాట్‌ వద్ద రైతులు, మహిళలు కృష్ణానదిలో మోకాళ్లపై నిల్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడాలంటూ మహిళలు కృష్ణమ్మకు సారే సమర్పించారు. వెలగపూడిలో రైతులు, మహిళలు మానవహారం నిర్వహించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. సీఎం జగన్‌ను, రైతు అమరావతి వైపు తీసుకొస్తున్నట్లుగా కృష్ణాయపాలెం రైతులు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. మందడంలో రైతులు ప్రధాని మోదీ మాస్కులు ధరించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మోదీ మాస్కు ధరించిన వ్యక్తికి విన్నవించి.. శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఉద్దండరాయునిపాలెం వద్ద అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో దళిత జేఏసీ నేతలు కేక్‌ కట్‌చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపి అమరావతిని కాపాడాలంటూ వేడుకున్నారు. అమరావతిపై జరుగుతున్న దాడిని చూపుతూ తుళ్లూరు శిబిరంలో రూపకం ప్రదర్శించారు. రైతులకు ఆంధ్రా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, జేఏసీ నేత డాక్టర్‌ రాయపాటి శైలజ, సోషల్‌ మీడియా కేసు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ, టీడీపీ నేతలు గద్దె అనురాధ, గొట్టిపాటి రామకృష్ణ, బీజేపీ బహిష్కృత నేత వెలగపూడి రామకృష్ణలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, తమపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో తప్పుడు కేసులు పెడుతుందని నేతల దృష్టికి తీసుకొచ్చారు.