ప్రత్యేక పూజలతో ప్రారంభించిన కొత్త రథం తయారీ

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రధం అనూహ్య పరిస్ధితుల్లో దగ్ధమైన విషయం తెలిసినదే. ఈ నేపధ్యంలో  స్వామి కళ్యాణోత్సవం నాటికి మరో కొత్త రథం తయారీకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా కొత్త రథం తయారీని ప్రారంభించారు.

రాబోయే ఫిబ్రవరిలో జరిగబోయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం నాటికీ రథం సిద్ధం కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఈ రోజు కొత్త రథం తయారీని ప్రారంభించారు. రావులపాలెంలోని వెంకట సాయి టింబర్‌ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన కలపను గుర్తించి దానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులతో పాటు దేవాదాయశాఖ ప్రతినిధులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ రథం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.95 లక్షల రూపాయలు మంజూరు చేసింది.

అంతర్వేది ఆలయ రథం దగ్ధం నేపథ్యంలో విపక్షాలు, హిందూసంస్ధల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆఘమేగాల మీద డిజైన్లు తెప్పించి వాటిలో ఒకదానికి ఆమోదముద్ర వేసి గతంలో కంటే మెరుగైన రథాన్ని ఎట్టిపరిస్దితుల్లోనూ ఫిబ్రవరి నాటికి నిర్మించి తీరాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించింది.

దీంతో అధికారులు దగ్గరుండి మరీ రథం తయారీని పర్యవేక్షిస్తున్నారు. రథం తయారీకి అవసరమైన కలపతో పాటు ఇతర వస్తువులన్నీ తూర్పుగోదావరి జిల్లాలోనే లభిస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా దీని నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.