గూగుల్’ సహకారం కోరిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే పరిష్కారంలో భాగంగా ఇంటర్నెట్ దిగ్గజం అయిన గూగుల్‌ ప్రతినిధులతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సైబర్‌ నేరగాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. యూట్యూబ్‌లో అభ్యంతరకర వీడియోలు పోస్ట్‌ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ వారికి సూచించారు. గూగుల్‌కు చెందిన వివిధ సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వారు ప్రజలను మోసం చేస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. సైబర్ నేరాల విషయంలో గూగుల్ సాంకేతిక టీమ్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ…గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్, గూగుల్ యాడ్స్ సర్వీసెస్, గూగుల్ వ్యూ ఫామ్‌ల ద్వారా అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు. యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసే వారిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ప్రతినిధులు గీతాంజలి దుగ్గల్, సునీతా మొహంతీ, దీపక్ సింగ్‌ పాల్గొన్నారు.