విద్యా కానుక మరోసారి వాయిదా

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న విద్యా కానుకను.. జూన్‌లో స్కూళ్లు ప్రారంభం కాగానే ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే కరోనా కారణంగా విద్యా సంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. పాఠశాలలను నవంబర్‌ రెండో తేది నుంచి తెరవనున్నారు. అయితే విద్యాకానుక కిట్లు ముందుగానే విద్యార్థులకు అందితే.. పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులు యూనీఫామ్ కుట్టించుకునే అవకాశం ఉంటుందని భావించింది ప్రభుత్వం. ఈ నెల 5న పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజయవాడ దగ్గర కంకిపాడులో ఒక స్కూల్‌కు స్వయంగా వెళ్లి పథకాన్ని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల మరోసారి జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మళ్లీ ఎప్పుడు ఉండేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.