10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు

ప్రపంచంలోనే అత్యంత సేఫ్‌ సిటీగా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. పోలీస్, పురపాలక శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్‌.. భాగ్యనగరంలో 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరంగా హైదరాబాద్ తొలి ప్లేసులో ఉందని ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉందని కేటీఆర్అన్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు 5 లక్షల 80వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మంత్రి సూచించారు.

జీహెచ్ఎంసీలో నూతన ఫ్లై ఓవర్లు, రోడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్అన్నారు. పార్కులు, చెరువులు, బస్తి దవాఖానా, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని.. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ తరుఫున తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ పలు సూచనలు చేశారు.

హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని.. ఇందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులతోపాటు పట్టణీకరణలో భాగంగా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ కలిసి పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో హైదరాబాదీలను ఆకట్టుకునే దిశగా తెలంగాణ సర్కార్ పలు వరాలు ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.