రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి: వేగుళ్ల లీలాకృష్ణ

*కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే
*రేపటిలోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలి
*చేలేని పక్షాన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు
*రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

మండపేట: రైతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. రైతులకు ఇవ్వవలసిన ధాన్యపు డబ్బు వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని కోరుతూ శుక్రవారం మండపేట తాహశిల్దార్ తంగెళ్ల రాజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైందని అన్నారు. ధాన్యాగారం అయిన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో గత రెండు నెలలుగా రైతులకు ఇవ్వవలసిన సొమ్ము జమ చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కోనసీమ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో క్రాఫ్ హాలిడే ప్రకటించి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారని.. మండపేట నియోజకవర్గంలో మాత్రం రైతులకు డబ్బు జమ చేయలేదని అన్నారు. మండపేట నియోజకవర్గానికి సంబంధించి కోట్లలో రైతులకు డబ్బులు రావాల్సి ఉందని.. పంట పెట్టుబడి సమయం కాబట్టి విత్తనాలకి, ఎరువులకి డబ్బులు లేక రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి రేపటిలోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని డిమాండ్ చేశారు. చేయని పక్షాన ఆదివారం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలో కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.