దివ్యాంగులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ.. నిరాహార దీక్షచేపట్టిన డా. యుగంధర్ పొన్న

*14 రోజుల్లో ఇంటి పట్టాలిస్తామన్న తహసీల్దార్

*డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పణ

*ఆమరణ దీక్ష విరమించిన జనసేన ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న

వెదురుకుప్పం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నవరత్నాలలో భాగంగా.. పేదలందరికీ ఇల్లు పథకంలో ఇంటి పట్టాలు మంజూరు చేయాలంటూ.. మంగళవారం జనసైనికులతో కలసి గంగాధరనెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న నెమల గుంట గ్రామానికి చెందిన దివ్యాంగులైన నాగరాజు… తదితరులకు అండగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా డా. యుగంధర్ మాట్లాడుతూ.. దివ్యాంగులైన నాగరాజు తదితర బాధిత కుటుంబాలకు నవరత్నాలలో ఇంత వరకు ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ కులానికి చెందిన నిరుపేదలు, దివ్యాంగులైన వారికి నవరత్నాలలో ఇళ్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో ఇంటి పట్టాలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యేంతవరకు ఆమరణ దీక్ష ఆగదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. తహసీల్దార్ 14 రోజుల్లో ఇంటి పట్టాలు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. ఇంటి పట్టా మంజూరు తో పాటు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రంకూడా ఇవ్వాలని, షెడ్యూల్డు కులాల అయిన దివ్యాంగులకు మనోధైర్యాన్ని కల్పించి.. జీవన భరోసా కల్పించి, నలుగురు దివ్యాంగులకు ఇల్లు కట్టించాలని ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. పద్నాలుగు రోజుల్లోపు సమస్యను పరిష్కరించక పోతే మళ్లీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎస్సీలకు ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కూడా పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు గుండె ధైర్యం జిమ్ కి వెళితే వచ్చేది కాదని.. ప్రజల సమస్యలను గుర్తించి, ఆ సమస్యకు పరిష్కారం చూపితే వచ్చేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, రాఘవ, ప్రధాన కార్యదర్శులు మోహన్, మధు, సతీష్, కార్యదర్శులు వినోద్, రజిని, మహేష్ నాయకులు వినోద్, కిషోర్, హేమంత్, రాజు, జనసైనికులు, బాధితులు నాగరాజ్, విజయ్, కవిత, మీనా పాల్గొన్నారు.