కవిత ఘన విజయం.. డిపాజిట్లు కొల్పోయిన ప్రత్యర్థులు

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. పదునైన పార్టీ వ్యూహరచన.. ఆపై అమితమైన కవిత ఆప్యాయత.. ఈ రెండూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను వన్ సైడ్ చేశాయి. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్‌లోనే ఆమె విజయం ఖాయం అయ్యింది.  తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి కల్వకుంట్ల కవిత ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. అయితే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న జరిగిన పోలింగ్ లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒక ఓటరు మరణించగా, కరోనా కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిథులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకున్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం పోలైన 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు తొలి రౌండ్‌లోనే 542 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ ముగిసే సరికి ఆమెకు 728 ఓట్లు పోలయ్యాయి.

ఇక బీజేపీ నేత సత్యనారాయణకు – 56 ఓట్లు, కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి -29 ఓట్లు చొప్పున పోలవగా 10 చెల్లని ఓట్ల పోలయ్యాయి. ఈ ఎన్నికలో డిపాజిట్ దక్కాంటే అభ్యర్థికి కనీసం 138 ఓట్లు పోలవ్వాలి. అయితే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఈ స్థాయిలో ఓట్లు పోలవకపోవడంతో వారి డిపాజిట్ గల్లంతయ్యింది.

ఎన్నికల్లో ఘనవిజయంపై కవితకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాలకు చెందిన నేతలు, బంధుమిత్రులు వివిధ మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఉజ్వల భవిష్యత్ ఉండాలని, ప్రజలకు మరింత సేవచేయాలని కవితమ్మను ఆశీర్వదిస్తున్నారు. ఇక తెలంగాణలోని అన్ని పార్టీ ఆఫీసులలోనూ కవిత విజయాన్ని కార్యకర్తలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.