ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్ పై మంత్రుల విమర్శలు: ఆళ్ళ హరి

*అవి ప్లీనరీ సమావేశాలు కావు జగన్ భజన కార్యక్రమాలు

*చెప్పుకోవటానికి ఈ మూడేళ్ళలో చేసిన మేలు లేకే పవన్ పై విమర్శలు

*పరదాల మాటున తిరుగుతూ దమ్మూ ధైర్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం

*అసత్యాలు, అబద్దాలు వల్లెవేయటంలోనూ, బూతులు మాట్లాడటంలోనూ పోటీ పడ్డ మంత్రులు

*వైసీపీకి ఒక్క చాన్స్ ఇవ్వటం చారిత్రక తప్పిదం అన్న అపరాధ భావనలో ప్రజలు

*జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో లభిస్తున్న ప్రజాదరణతో వైసీపీకి ఓటమి తప్పదని నిఘా సంస్థల ద్వారా అందిన సమాచారంతో వైసీపీ నేతలకు వెన్నులో వణుకుమొదలైందని, రానున్న ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదన్న భయంతోనే పవన్ కళ్యాణ్ పై మంత్రులు అసంబద్ధ విమర్శలు చేస్తున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శనివారం వైసీపీ ప్లీనరీ వేదికగా జనసేన పార్టీపై మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్ళహరి మాట్లాడుతూ ఈ మూడేళ్ళలో తమ అసమర్ధ, అరాచక, అవినీతి పాలనతో ప్రజలకు చేసిన మేలు చెప్పుకోవటానికి ఏమీ లేక ప్రతిపక్షాలను విమర్శించటానికే మంత్రులు పోటీ పడ్డారని విమర్శించారు. వైకాపా నిర్వహిస్తోంది ప్లీనరీ సమావేశాలా లేక పవన్ కళ్యాణ్ ని విమర్శించటానికి ఏర్పాటు చేసుకున్న వేదికలా అని ప్రశ్నించారు. అది అసలు ప్లీనరీ కాదని వైసీపీ భజన బృందం జగన్ ని పొగిడేందుకు , జగన్నామస్మరణ చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పనికిరాని సమావేశం అని విమర్శించారు. సొంత మేనల్లుడితో మేనమామ అనిపించుకోలేని వ్యక్తి , తోడబుట్టిన చెల్లిని పక్కరాష్ట్రానికి తరిమేసిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పవన్ కళ్యాన్ స్వేచ్ఛగా పర్యటిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం భయపడుతూ తిరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు దమ్మూ ధైర్యం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి భార్యని, తన సొంత తల్లిని గెలిపించుకోలేని జగన్ ని పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఓటమి గురించి మాట్లాడటం ముఖ్యమంత్రిని అవమానించటమేనని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ని రెండు చోట్లా ఓడించటానికి వేయి కోట్లు ఖర్చుపెట్టామని వైసీపీ శాసనసభ్యులే అన్న మాటలు మంత్రులు మరచిపోయి ఉంటారని చురకలంటించారు. వైకాపాకి ఒకసారి అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని , మరో అవకాశం ఇస్తే భారతదేశ చిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్ పటం లేకుండా చేస్తారని ఈ నేపథ్యంలో మరోఛాన్స్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు జనసేన ఎన్నికలకు వెళ్తుందని , అది మా నాయకుడి చూసుకుంటారని మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది పొత్తుల గురించి కాదని, గతంలో ఇచ్చిన హామీల్ని ఎన్ని నెరవేర్చారు, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారో వివరిస్తే బాగుంటుందన్నారు. ప్రజా మద్దతు వైసీపీకి ఉంటే గడప గడప కార్యక్రమంలో మంత్రుల్ని, శాసనసభ్యుల్ని ప్రజలెందుకు వెంటపడి ఉరికెత్తించారని అన్నారు. ప్లీనరీ వేదికగా అసత్యాలు, అబద్దాలు చెప్పడంలో వైసీపీ నేతలు పోటీ పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలు, వాళ్ళ నాయకుడు మరోసారి పాదయాత్ర చేస్తే ప్రజలు ఏ విధంగా స్వాగతం చెబుతారో చూడాలని ఉందని, ప్రజా స్పందనని కళ్లారా చూడాలని ఉందన్నారు. ప్రజలిచ్చిన అధికారంలో అరవై శాతం సమయం అయిపోయిందని మిగిలిన సమయమన్నా ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై పెట్టి ప్రజల రుణాన్ని తీర్చుకోవాలని, లేనిపక్షంలో చరిత్ర హీనులుగా వైసీపీ నేతలు మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజల్ని ఎల్లకాలం మోసగించలేరని , వైసీపీకి ఒక్క సారి అవకాశం ఇచ్చి రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రక తప్పిదం చేసామన్న అపరాధ భావన ప్రజల్లో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని చారిత్రక తీర్పుని ఇవ్వనున్నారని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారని ఆళ్ళ హరి అన్నారు.