ఏపీకి ఆర్థికసాయం చేయాలి.. కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఏపీకి ఆర్థికసాయం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. వర్షాలు, వరద నష్టంపై రాష్ట్రాన్ని ఆదుకోవాలని లేఖలో కోరారు. వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు , వరదలతో తీవ్రంగా నష్టపోయామన్నారు సీఎం. 2 వేల 250 కోట్ల ఆర్థికసాయం చేయాలని కోరారు. దాదాపు 4 వేల 400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, వెంటనే వెయ్యి కోట్లు మంజూరు చేయాలని అమిత్‌షా కు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఈ నెల 9నుంచి 13వరకు కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తొమ్మిది జిల్లాల్లోని 71,800 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు లేఖలో సీఎం పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ సిబ్బంది నిర్విరామంగా పనిచేసినా 14మంది మృతి చెందినట్టు సీఎం లేఖలో తెలిపారు.