నేడు శ్రీ గాయత్రిదేవిగా దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు దుర్గమ్మ గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందిన గాయత్రీదేవి రూపాన్ని దర్శించుకోవడానికి ఏటా భక్తులు పెద్దఎత్తున అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ముక్త, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించే.. పంచముఖ సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసించే త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల మంత్రసిద్ధి ఫలాన్ని పొందుతారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.