విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు

తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల పేరుతో  అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని చిర స్థాయిగా నిలచిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో… అందాల రాముడు, కృష్ణుడు ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తే ఆ పాత్రకు పరిపూర్ణత లబిస్తుంది.  రామునిగా, కృష్ణునిగా  తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా(రాముడు మరియు కృష్ణుడు అంటే రామారావు అనుకునేలా) నిలచిపోయిన ఎన్టీఆర్ తెలుగు, తమిళం మరియు  హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. ఒక గొప్ప నటునిగానే కాకుండా, ప్రజానాయకుడిగా ప్రజలకు సేవలను అందిoచి తెలుగు ప్రజల “అన్నగారు” గా ఎన్టీఆర్ నిలిచారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్ ది తిరుగులేని ప్రస్థానం.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రయణoలో కొన్ని విషయాలు మననం చేసుకుందాం.

జననం మరియు నామకరణం:

నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, నిమ్మకూరు అనే ఒక గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది క్రమేపి తారక రామారావుగా మారింది.

ఆయన విద్య పాఠశాల నుండి కాలేజి వరకు విజయవాడ లోనే జరిగినది.  కాలేజి రోజుల్లో మంచి మంచి నాటకాల్లో నటించేవారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరారు. కాలేజీ రోజుల్లో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవనం కోసం అనేక పనులు చేసారు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదు.

రామారావు 1947లో పట్టభద్రుడయ్యారు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష వ్రాయగా… పరీక్ష వ్రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచారు. అప్పుడు ఆయనకు  మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు.

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతనిని మద్రాసు పిలిపించి “పల్లెటూరి పిల్ల” సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసారు. దీనికి గాను ఆయనకు వెయ్యి నూట పదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా “మనదేశం” అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు. అందుచే ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్రలో కనిపించారు. 1950లో “పల్లెటూరి పిల్ల” విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు “షావుకారు” కూడా విడుదలైంది. అలా ఆయన చలనచిత్ర జీవితం ప్రారంభమైంది.

తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.

రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చారు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారు.

విజయా సంస్థతో కుదిరిన ఒప్పందంతో  ఎన్టీఆర్ ఆ బ్యానర్ కు ఆస్థాన నటుడయ్యారు. 1951లో కె.వి.రెడ్డి డైరెక్షన్ లో విజయా వారు నిర్మించిన ‘పాతాళ భైరవి’ నటుడిగా ఎన్టీఆర్‌కు తిరుగులేని స్టార్ డమ్ తీసుకొచ్చింది. 1956లో విడుదలైన ‘మాయాబజార్’లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికారు.  వెండితెరపైననే కాక ప్రజల ఊహలలో కూడా కృష్ణుడంటే ఆయనే అనేంతగా బలమైన ముద్ర వేసారు. తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించారు.

రామారావు తొలిసారిగా రాముని పాత్రలో ‘చరణదాసి’ అనే సాంఘిక చిత్రంలో కనిపించారు. రామారావు శ్రీరాముని పాత్రలో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు… అలా కనిపించింది తమిళంలో తీసినటువంటి ‘సంపూర్ణ రామాయణం’ అనే చిత్రంలో.  ఆ తర్వాత 1963లో విడుదలైన ‘లవకుశ’ సినిమా.. రాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టింది.

తర్వాత 1959లో ఎవియమ్ వారు నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోసారు రామారావు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్ఎటి పై నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించడమే కాకుండా అందులోనూ రావణుడిగా నటించి మెప్పించారు. ఈ తర్వాత ‘వేంకటేశ్వర స్వామి మహత్యం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో వేంకటేశ్వరుడిగా కూడా ఆ పాత్రకు జీవం పోసారు .

పౌరాణికాలే కాదు జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. 1977లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవిరాముడు’తో ఎన్టీఆర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. అదే ఏడాది విడుదలైన ఎవ్వర్ గ్రీన్  ‘దాన వీర శూరకర్ణ’ ఎవరూ మరిచిపోలేరు. అందులో ఆయన పోషించిన  శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు వేరెవరికైనా అనితరసాధ్యo….దాదాపు 4 గంటల సమయం కలిగిన ఈ సినిమాను ఎలాంటి సన్నివేశాలు తొలగించకుండా విడుదల చేసినప్పటికీ అఖండ విజయం సాధించింది.

ఆ తర్వాత 1979 లో య‌న్టీఆర్ ‘శ్రీమద్విరాట పర్వము’లో 5 పాత్రలు పోషించి మెప్పించిన ఘనత ఆయనది. ఈ సినిమాలో శ్రీకృష్ణ, దుర్యోధన, కీచక, అర్జున, బృహన్నల పాత్రల్ని అవలీలగా పోషించి ప్రేక్షకులను మెప్పించిన తీరు అభినందనీయం. అలాగే యన్టీఆర్ స్టార్‌గా వెలుగుతున్న దశలోనే తాత, తండ్రి, మనవడి పాత్రల్లో ‘కులగౌరవం’ అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేసారు. పేకేటి శివరాం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యన్టీఆర్ నటించిన చిత్రాలలో అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ద్విపాత్రాభినయంతో నటించిన చిత్రాలు లెక్కలేనన్ని.

‘మన దేశం’ చిత్రం యన్టీఆర్ నటించిన ఆఖరి మాస్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతూ ఉండగానే యన్ఠీఆర్  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సామ్రాట్ అశోక’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ లాంటి  చారిత్రక , పౌరాణిక  చిత్రాలు తీసి అటు ముఖ్యమంత్రిగా మరియు ఇటు కధానాయకుడిగా ఆయన పాత్రలకు న్యాయం చేసారు.

యన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో  13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెర పై చెరగని ముద్ర వేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా విజయం సాదించి…ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు. ఆయన రాజకీయ జీవితం లోని  విశేషాలు మరొక ఆర్టికల్ లో తెలుసుకుందాం