ప్రజల ప్రాణాలను సైతం తీస్తున్న కార్పొరేటర్ల వేధింపులు

  • మితిమీరుతున్న వైసీపీ కార్పొరేటర్ల దందా
  • పేద మధ్యతరగతి ప్రజల్ని పీక్కుతింటున్న కొంతమంది కార్పొరేటర్లు
  • ఇల్లు కట్టుకోవాలి అంటే లోకల్ టాక్స్ కట్టాల్సిందే
  • తోపుడు బండ్లని, చేపల వ్యాపారులని వదలని కార్పొరేటర్లు
  • ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి అక్రమ వసూల్లే లక్ష్యంగా పరిపాలన
  • చరిత్ర క్షమించని రీతిలో వైసీపీ చోటా నాయకుల దౌర్జన్యకాండ
  • తీరు మార్చుకోకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు
  • నాయకుల ఎంపికపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

అర్బన్ జిల్లా పరిధిలో అధికార పార్టీ కార్పొరేటర్ల వేధింపులు తీవ్రస్థాయికి చేరుకున్నాయని, చివరికి ప్రజల ప్రాణాలను సైతం హరించే స్థాయికి కార్పొరేటర్ల దందా కొనసాగుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని 30 వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి వేధింపులు తాళలేక రియల్ ఎస్టేట్ వ్యాపారి గిరిధర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా కొంతమంది కార్పొరేటర్లు ప్రజల్ని పీడించుకుతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిముందు ఇసుక కనిపిస్తే చాలు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలు రాబందుల్లా వాలుతున్నారన్నారు. కట్టడాలకు ఎన్ని అనుమతులున్నా లోకల్ కార్పొరేటర్ టాక్స్ కట్టిన తరువాతే పని మొదలు పెట్టాలంటూ వేలాది రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఇవి చాలవన్నట్లు తోపుడు బండ్ల వారిని చిన్న చిన్న వ్యాపారస్థులను బెదిరిస్తూ నెలవారీ చందాలు వసూలు చేయటం దారుణమన్నారు. విడో, ఒంటరి మహిళల, వృధ్యాప్య పింఛన్ల వారి దగ్గర కూడా కక్కుర్తిపడుతున్నారని ఇంతకన్నా నీచం ఇంకోటి ఉండదని ధ్వజమెత్తారు. ఇందుకా మిమ్మల్ని కార్పొరేటర్లుగా ఎన్నుకుందా అని ప్రశ్నించారు. యథా అధినాయకుడు తథా చోట నాయకులు అన్న చందాన వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఒకవైపు కొండల్ని తవ్వేస్తూ మైనింగ్, ఇసుక వంటి సహజవనరులను దోచుకుంటూ, మరోవైపు ప్రజల రక్తాన్ని మద్యం రూపంలోనూ తాగుతున్నాడని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చోటా నాయకులు పేద మధ్యతరగతి ప్రజల్ని కాల్చుకుతింటున్నారని దుయ్యబట్టారు. అదేమన్నా అంటే మేము కోటి రూపాయలు పెట్టి గెలిచింది ప్రజలకు సేవ చేయటానికి కాదంటూ కొంతమంది కార్పొరేటర్లు బాహాటంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యం అన్నారు. వడ్డీ వ్యాపారులను, మాదక ద్రవ్యాలు తయారు చేసేవారిని నాయకులుగా ఎన్నుకుంటే పరిపాలన ఇలా కాక ఎలా ఉంటుందన్నారు. ప్రజలు ఇప్పటికైనా తమ ఓటు విలువ తెలుసుకోవాలని, ఓటు వేసే ఒక్క క్షణం ముందన్నా ఓటు ఎటువంటి వ్యక్తికి వేస్తున్నామో ఆలోచించాలని కోరారు. ఓటు వేసే వ్యక్తికి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉందా, సమాజం పట్ల బాధ్యత ఉందా, దేశం పట్ల భక్తి ఉందా అసలు పిలిస్తే కనీసం పలికే వ్యక్తి ఏనా అని ఆలోచించి ఓటు వేయాలని అప్పుడే మంచి నాయకులతో సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. అలా కాకుండా అతను మా కులస్థుడు, మా మతస్థుడు అనో లేక అప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చే తాత్కాలిక తాయిలాలకు ఆశపడో ఓటును దుర్వినియోగం చేస్తే భవిష్యత్ ఇంకా దారుణంగా ఉంటుందన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఈ సందర్భంగా ఆళ్ళ హరి కార్పొరేటర్లును కోరారు. ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం అందరికీ రాదని, పూర్వజన్మ సుకృతంగా వచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తమకి ఏ కష్టం వచ్చినా మా కార్పొరేటర్ ఉన్నాడు అన్న ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలని అప్పుడే చరిత్రలో మీకంటూ ఒక స్థానం ఉంటుందన్నారు. అలా కాకుండా డబ్బే పరమావధిగా ప్రజల్ని వేధిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆళ్ళ హరి హెచ్చరించారు. సమావేశంలో నగర సంయుక్త కార్యదర్సులు అందే వెంకటేశ్వర్లు, కొనిదేటి కిషోర్, మహంకాళి శ్రీనివాస్, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.