బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్

టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం వీరిద్దరూ బీబీ3 సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. కరోనా ప్రభావం వారం రోజుల షూట్‌ తర్వాత బాలకృష్ణ, బోయపాటి సినిమాను అడ్డుకుంది. అయితే ఈ నెల 29న షూటింగ్‌ మొదలవడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి సమ్మర్‌ రిలీజ్‌కు రెడీ చేయాలనే ప్లాన్‌లో ఉంది చిత్ర యూనిట్‌. ఇదిలా ఉంటే మరో క్రేజీ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

తెలంగాణ ఐకానిక్ హీరోగా పేరుగాంచిన గోనగన్నారెడ్డిపై సినిమా చేసేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని, బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేది నిజమేనా..? కాదా..? అనేది తెలియాలంటే అటు బాలయ్య, బోయపాటి నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది.