ఈశాన్య రుతుపవనాల రాక

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. మరోవైపు దక్షిణాదిన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.

ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మూడు కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలిచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈశాన్యగాలులు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో అనేక చోట్ల.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు కురిసింది. పగటిపూట మాత్రం ఎండ కొనసాగింది.