పవన్ కల్యాణ్ సినిమాలో – ‘ఈగ’ సుదీప్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు . ‘వకీల్‌ సాబ్‌’ సినిమా సెట్స్‌పై ఉండగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ దశమి కానుకగా.. పవన్ కల్యాణ్ మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇక తాజాగా ప్రకటించిన పవన్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ మూవీపై సోషల్‌ మీడియాలో అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్‌కు రీమేక్‌ అని, వకీల్‌ సాబ్‌ తర్వాత పవన్‌ ఈ చిత్రంలోనే నటించనున్నాడని అంటున్నారు. అలాగే పవన్‌తో పాటు ఈ చిత్రంలో నటించే మరో హీరోగా రానా, నాని, నితిన్‌ పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో పవన్‌తో పాటు కలిసి నటించే హీరోగా కన్నడ స్టార్‌ హీరో, ‘ఈగ’ విలన్‌ సుదీప్‌ పేరు వినబడుతోంది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ని.. సుదీప్‌ ఆయన ఆఫీస్‌లో కలిసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కలయిక వెనుక కారణం ఇదేనని, ఈ సినిమా కథ గురించే వారు డిస్కస్‌ చేశారని అంటున్నారు. కిచ్చా సుదీపే ఈ చిత్రంలో రెండో హీరో అని.. టాలీవుడ్‌ సర్కిల్స్‌లో కూడా వార్తలు బయలుదేరాయి. మరి ఫైనల్‌గా పవన్‌తో కలిసి నటించే హీరో ఎవరవుతారో తెలియాలంటే.. చిత్రయూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.