కాలుష్యకారక పరిశ్రమలను… పర్యావరణానికి హాని చేసే చర్యలను గుర్తించండి

మీ చుట్టు పక్కల పారిశ్రామిక వ్యర్థాలను ఏ మాత్రం శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారా? ఫలితంగా మీ ప్రాంతంలో జల వనరులు, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయా? పరిశ్రమలే కాదు నగరపాలక సంస్థలు సైతం మురుగునీటి శుద్ధి ప్లాంట్లను సక్రమంగా నిర్వహిస్తున్నాయా? వాయు, జల కాలుష్యాలకు సంబంధించిన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి?… వీటన్నింటిపై ప్రతి జన సైనికుడు, జనసేన నాయకుడు, వీర మహిళ దృష్టిపెట్టాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కోరారు. ఇందుకు సంబంధించిన సమాచారం, వివరాలు బయటకు తీయండి. రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి. అడవుల్లో సైతం పచ్చదనాన్ని నాశనం చేస్తూ అక్కడి సంపదను దోచేస్తూ పర్యావరణానికి హాని చేసే మైనింగ్ సంస్థల వివరాలను, అడ్డగోలుగా కొండలను తొలిచేస్తూ, పచ్చదనాన్ని హరించే ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దాం. మీమీ పరిధిలో ఉన్న కాలుష్యకారక ప్రాజెక్టులు, వాటి మూలంగా కలుగుతున్న హాని, మీ ఆరోగ్యాలకు ఎంత నష్టం కలుగుతుందో చెప్పండి. సదరు పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణను ఎంత ప్రహసనంగా మార్చి, ప్రభుత్వ బలగాలతో ఏ విధంగా ఆందోళనలను అణచి వేస్తున్నారో కూడా వెల్లడించే సమయం వచ్చింది. అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో? లేదో? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ మేరకు ఈ వివరాలను పొందుపరిచిందో? అయినా మన వంతు బాధ్యతగా అన్ని వివరాలూ బయటకు తీసుకువద్దాం. మన జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఈ కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు వాటి మూలంగా కలుగుతున్న హానిని ప్రజా క్షేత్రంలో వెల్లడిద్దాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *