‘సెహరి’..మూవీ లాంచ్

సీనియర్ సంగీత దర్శకుడు కోటి ముఖ్యపాత్ర పోషించనున్న కొత్త సినిమా ‘సెహరి’. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు బాబీ, ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ ముఖ్య అథిదులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. దిల్ రాజు క్లాప్ కొట్టారు. దర్శకనిర్మాతలకు భరత్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ ‘వినూత్న ప్రేమకథా చిత్రమిది. ఇందులో హీరో తండ్రి పాత్రలో కనిపించబోతున్నా. నటుడిగా నాకు బ్రేక్‌ తీసుకొస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. హర్ష్‌ మాట్లాడుతూ ‘హీరోగా నటిస్తూ నేను కథను అందిస్తున్న చిత్రమిది. పెళ్లివేడుక నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. నా స్నేహితుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నా’ అని చెప్పారు. ఈ నెల రెండో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని దర్శకుడు పేర్కొన్నారు.