ఏపీలో మూడు మెగా ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్

ఏపీ లో మూడు మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది.  సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఎన్‌ఐపీబీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలను మంత్రులు మరియు అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి ఆమోదం అందిస్తున్నట్లుగా కూడా ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఇంటిలిజెంట్‌ సెజ్‌, అదానీ డెటా సెంటర్‌ మరియు ఏటీసీ టైర్ల పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ మూడు మెగా ప్రాజెక్ట్‌ల ద్వారా ఏపీకి రూ.16 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దాంతో పాటు 39 వేల ఉద్యోగాలు కూడా యువతకు దక్కే అవకాశం ఉంది అంటూ ప్రభుత్వం పేర్కొంది.

విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల విషయమై కూడా ఎన్‌ఐపీబీ సమావేశంలో చర్చించారు. విశాఖలో పూర్తిగా కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సీఎం సూచించారు. విశాఖలోని మధురవాడలో అదాని డేటా సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇంటెలిజెంట్‌ సెజ్‌ కంపెనీ చెప్పుల తయారీని చెపట్టబోతున్నారు. ఇక విశాఖ అచ్యుతాపురంలో ఏటీసీ టైర్ల ఉత్పత్తి జరుగబోతుంది అంటూ ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.