అమూల్యమైన మీ వాత్సల్యానికి మనఃపూర్వక కృతజ్ఞతలు
పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటూ… ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉంటాను. ఈ యేడాది కూడా అదే విధంగా జన్మదినం సందర్భంగా ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకోవడం నా బాధ్యతగా భావిస్తాను. నాపై ఉన్న వాత్సల్యంతో, అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రేయోభిలాషులైన పెద్దలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందచేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, సినీ తారలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, పాత్రికేయులు, ప్రవాస భారతీయులు శుభాకాంక్షలు తెలిపారు. నన్ను తమ కుటుంబంలో ఒకడిగా చూసుకొంటున్న అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తమదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లడించారు. నాపై అమూల్యమైన వాత్స్యల్యాన్ని కనబరుస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారందరికీ ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. రక్త దాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి నా జన్మదిన కార్యక్రమానికి ఒక ప్రయోజనం కలిగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.