శాంతియుతంగా దీక్ష చేయడం నేరమా?: నలిశెట్టి శ్రీధర్

  • ఆత్మకూరు జనసేన నాయకుల అక్రమ అరెస్ట్

ఆత్మకూరు, ఏ.ఎస్.పేట మండలం, పెద్ద అబ్బీపురం గ్రామంలో అమానుషంగా 96 మామిడి చెట్లు నరికిన నిందితులను అరెస్టు చేయాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆమరణ నిరాహార దీక్ష గత రెండు రోజుల నుండి చేస్తుండగా మంగళవారం రాత్రి సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో దాదాపు 20 మంది పోలీసుల బృందం వచ్చి ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న నలిశెట్టి శ్రీధర్ తో పాటుగా 18 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆయన మాత్రం తప్పించుకుని 3వ రోజు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నానని శ్రీధర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. పోలీస్ అధికారులు చెట్లను నరికిన నిందితులను అరెస్టు చేయడం మానేసి శాంతియుతంగా సమస్య పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని శ్రీధర్ ప్రశ్నించారు. అరెస్టు చేసిన జనసేన కార్యకర్తలను పోలీసులు విడిచి పెట్టారని అలాగే పోలీస్ అధికారులు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం దీక్షను విరమిస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు.