వైసీపీ నియంత పాలన నుంచి రాష్ట్రానికి త్వరలోనే విముక్తి

  • జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్

గుంటూరు, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసిందని, వైసీపీ నియంత పాలన నుంచి త్వరలోనే రాష్ట్రానికి విముక్తి లభిస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంతో వైసీపీ నేతలకు జవజీవాలు కుంగిపోయాయనన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ పెను సంచలనం కానుందన్నారు. తమని తాము సింహాలతో, పులులతో పోల్చుకునే వైసీపీ నేతలు జనసేనను చూస్తే మాత్రం దడుపు జ్వరం తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చారిత్రక అవసరమని బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల్ని ఎవరెన్ని రకాలుగా తిట్టినా సహించిన పవన్ కళ్యాణ్ తన తోటి నాయకులను, జనసైనికులను ఇబ్బంది పెడితే మాత్రం సహించలేకపోయారన్నారు. తనని నమ్మినవారి కోసం ఎక్కడికైనా పోరాటానికి సిద్ధపడే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి నాయకత్వంలో నేను సైతం ముందుకు సాగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. రోజురోజుకీ రాష్ట్ర రాజకీయ రూపురేఖలు మరిపోనున్నాయని , రానున్న ఎన్నికల్లో జనసేనకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా లాంటి నేతలు ముస్లిం మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించడం మా కర్మ అంటూ కమాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో చర్చించటానికి ఏనాడూ ముందుకురాని మంత్రులు పవన్ కళ్యాణ్ ని విమర్శించటానికి మాత్రం పోటీ పడుతూండటం సిగ్గుచేటన్నారు. తమ పార్టీ ఎలా ముందుకెళ్ళాలో చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదని, జనసేన పార్టీ రాజకీయ ఎత్తులను చూసి వైసీపీ నేతలకు ఫ్యాన్ట్లు తడిసిపోతున్నాయని నాయబ్ కమాల్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక్క ప్రసంగం వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్ ని అతలాకుతలం చేసిందన్నారు. మూడన్నరేళ్లుగా వైసీపీ ప్రజా కంటక పాలనతో ప్రజల జీవితం త్రిశంఖు స్వర్గంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత అసమర్ధ క్యాబినెట్ ని చూడలేదని, మంత్రులు రబ్బర్ స్టాంపులుగా మారి జగన్ రెడ్డికి ఆడమన్నట్లు ఆడుతూ జీవచ్చవాళ్ళా బ్రతుకుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క వ్యాఖ్యానికే వక్రభాష్యం చెబుతూ నీతివ్యాఖ్యలు చెబుతున్న వైసీపీ నేతలకు ఇన్నాళ్లకు సభ్యతా సంస్కారాలు గుర్తుకువచ్చాయా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాతనాన్ని మరచిపోయి ప్రవర్తించే వైసీపీ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక నుంచి ప్యాకేజీ, దత్తపుత్రుడు అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజా క్షేత్రంలో చెప్పు దెబ్బలు తప్పవని వైసీపీ నేతల్ని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎంతో అవసరమని గాదె అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, తన్నీరు గంగరాజు, దాసరి వెంకటేశ్వరరావు, నెల్లూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.