నేడు ఏపీ రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ

నేడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల’ పధకాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. 2019 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14.58 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వడ్డీ రాయితీ డబ్బును జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూ. 510.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే అక్టోబర్ నెలలో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకూ ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 132 కోట్లు అందించనుంది.

పంట నష్టం జరిగిన సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ అందించాలన్న సీఎం జగన్ నిర్ణయం మేరకు.. అక్టోబర్ నెలలో జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేసి.. నెల రోజుల వ్యవధిలోనే పెట్టుబడి రాయితీ సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అలాగే పంట రుణాలను సకాలంలో చెల్లిస్తున్న చిన్న, సన్నకారు రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన ప్రతీ రైతుకు సున్నావడ్డీ రాయితీని అందించేలా చర్యలు తీసుకుంటోంది. రైతు భరోసా కేంద్రాల వద్ద లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా రైతుల ఖాతాల్లో వేస్తూ వస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.