చెరుకు కొనుగోళ్లులో దళారుల దోపిడీ లేకుండా చూడండి

  • బకాయిలు చెల్లించి, మద్దతు ధర ప్రకటించాలి
  • అన్ని తూనిక కేంద్రాల్లో చెరుకు కొనుగోలు చేయాలి
  • సకాలంలో కటింగా ఆర్డర్ ఇచ్చి, లారీలు పంపించాలి
  • జిల్లా కలెక్టర్ కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు చెరుకు కొనుగోళ్లలో దళారుల దోపిడి లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను జనసేన పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, బంటు శిరీస్ సిరిపురపు గౌరీ శంకర్, మండల శరత్ బాబు, రాగోలు రాంబాబు, ఎస్. గణేష్ తదితరులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో సీతానగరం మండలం, లచ్చయ్యపేటలోని ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వలన తరతరాలుగా నమ్ముకొని చెరుకు పండిస్తున్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. ఇక్కడ చెరుకు పండించిన రైతులు సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించడం అనేది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమన్నారు. కాబట్టి ఎప్పటిలాగే ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని అన్ని తూనిక కేంద్రాల్లో చెరుకు కొనుగోలు చేయాలన్నారు. నాలుగు, ఐదు కేంద్రాల్లో చెరుకు కొనుగోలు చేస్తే రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు. అటువంటి సమయాల్లో రైతులు ఒత్తిడికి లోనవుతారన్నారు. ఆ ఒత్తిడిని సొమ్ము చేసుకునేందుకు కొంతమంది దళారులు రంగ ప్రవేశం చేసి కంపెనీ ఉద్యోగులతో గుమ్మక్కై మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. గతి ఏడాది క్షేత్రస్థాయిలో జరిగిన ఇబ్బందుల్ని పర్యవేక్షణలోకి తీసుకొని ఈ ఏడాది చెరుకు కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఈ నెలలోనే గానుగు ప్రారంభమవుతున్న దృష్ట్యా చెరుకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. రూ. 3500లు వరకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. అలాగే పాత బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారని ప్రశ్నించారు. యాజమాన్యం ఇక్కడ రైతులకు సకాలంలో కటింగ్ ఆర్డర్లతో పాటు లారీలు పంపించేలా చర్యలు చేపట్టాలన్నారు. జనవరి నెల నాటికి మొత్తం వ్యవహారం పూర్తయితే రైతులు మిగతా సాగుపై దృష్టి సారిస్తారన్నారు. దాదాపు లక్ష 50 వేల టన్నులు చెరుకు ఉత్పత్తి చేస్తున్న ప్రాంతంలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీని మూతవేయడమనేది ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రైతు వ్యవసాయానికి దూరమైతే తిండిగింజలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందని, రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మధ్యలో వచ్చిన దళారులు లాభపడుతున్నారని, రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దేనికి స్పందించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈఏడాది చెరుకు కొనుగోలు సంబంధించి మధ్యవర్తులు లేకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. బకాయిలు త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.