జగనన్న కాలనీలా…? జగడాల కాలనీలా…?

  • జగనన్న లే అవుట్లలో పెచ్చు మీరుతున్న ఆగడాలు
  • చోద్యం చూస్తున్న సచివాలయ, రెవెన్యూ అధికారులు
  • రోడెక్కే పరిస్థితి తీసుకురావద్దు జనసేన పార్టీ నాయకులు.

పార్వతీపురం పట్టణ పరిసర ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల కోసం ఏర్పాటు చేసినవి జగనన్న కాలనీలా…? లేక జగడాల కాలనీలా…? అని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, వంగల దాలి నాయుడు, నెయ్యిగాపుల సురేష్, సిరిపురం గౌరీ శంకర్, బార్నాల పవన్ కుమార్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ సమీపంలోని కొత్తవలస గోపాలపురం, మరికి, నర్సిపురం పరిసర ప్రాంతాల్లో జగనన్న లేఅవుట్లు ఏర్పాటు చేసి అందులో పేదవారికి ఇళ్ళు మంజూరు చేసి ప్రభుత్వం జగనన్న కాలనీలుగా పిలుస్తోందన్నారు. అయితే గత కొద్దిరోజులుగా జగనన్న కాలనీలు… జగడాల కాలనీలుగా మారాయని ఎద్దేవా చేశారు. కొంతమంది లబ్ధిదారులు తమ దృష్టికి వారి సమస్యలను తీసుకొచ్చారన్నారు. గతంలో తమకి కొత్తవలస గోపాలపురం గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన జగనన్న లేఔట్ లో పట్టాలు ఇచ్చి, స్థలాలు చూపించారన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కొంతమంది వచ్చి తమ స్థలంలో పునాదుల ఏర్పాటు చేస్తున్నారన్నారు. అది మాకు కేటాయించిన స్థలం అని చెబితే మాకు ఇక్కడ పునాదులు వేసుకోమన్నారు. మీకు నచ్చిన దగ్గర చెప్పుకోండనే సమాధానాలు చెప్తున్నారన్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు వారి అండదండలతో జగనన్న కాలనీలో తమ జులుం చలాయిస్తున్నారని వాపోయారన్నారు. ప్రజాప్రతినిధులు అండదండలతో ఆ కాలనీలో వారి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయన్నారు. అలాగే కొంతమంది నాయకులు ఆయా కాలనీలో కమ్యూనిటీహాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయించిన స్థలాలను అమ్మకాలు చేసుకుంటున్నారని ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కొంతమంది స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేయడమే కాకుండా అమ్మకాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. గత కొద్దిరోజులుగా జగనన్న కాలనీలో జగడాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత సచివాలయ, రెవెన్యూ సిబ్బంది చోద్యం చూస్తున్నారన్నారు. చీమ చిటుక్కుమంటే తెలిసిపోయే విధంగా సచివాలయ, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పాలకులు, అధికారులకు ఇవి కనబడలేదా…? అని ప్రశ్నించారు. దీనికి ఏమి సమాధానం చెబుతారాని ప్రశ్నించారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది ఫెయిలయ్యారన్నారు. ఈ జగడాల వెనుక ఉన్నదెవరో ఉన్నతాధికారులు బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో తామే రోడ్డు ఎక్కుతామని హెచ్చరించారు. పార్వతీపురం పట్టణంలో ఏమి చేసినా… అడిగే వారు లేరు అనే ధీమాతో ఉన్న ప్రజా ప్రతినిధులకు, వారికి కొమ్ము కాసే అధికారులు, సిబ్బందికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.